సమగ్ర అభివృద్ధికి దిక్సూచి ఈ బడ్జెట్: మంత్రి శ్రీధర్ బాబు
హైదారాబాద్, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:-సబ్బండ వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలను చేరవేయాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పం అని, ఈ లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ మార్గనిర్దేశనం చేస్తుందని, సంతులిత అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతుల పెంపు, విద్యా రంగ పురోగతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసిన ప్రగతిశీల బడ్జెట్ అని మంత్రి కొనియాడారు.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అందుకే తమ ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.6వేల కోట్లు కేటాయించామని, ఒక్కో లబ్దిదారుడికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని, తద్వారా యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని పరుగులు తీయించాలన్నది తమ ప్రభుత్వం ప్రణాళిక అని, అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతూనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి దిక్సూచిలా దారి చూపుతుందని తెలియజేశారు.
మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూపించి ప్రతిపక్షాల నోర్లు మూయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే మరోవైపు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు.